జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
కుల్గామ్ జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఉగ్రదాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భూపేంద్ర కుమార్ భైనా, దీపక్ రాత్రే మృతి చెందారు. బలోదాబజార్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల భూపేంద్ర కుమార్ గత ఆరు నెలలుగా జమ్మూకశ్మీర్‌లో ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్యతో కలిసి అక్కడికి వెళ్లి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్నారు.
ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన భూపేంద్ర కుమార్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో స్వగ్రామం ఛుయిహాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మెరుగైన జీవితం కోసం కష్టపడుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
భూపేంద్ర కుమార్ సోదరి తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఆయన భార్యతో కలిసి ఆరు నెలల క్రితం కశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబానికి అండగా నిలిచిన భూపేంద్ర అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
మృతుడి తల్లిదండ్రులు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కూలీ పనులు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రాత్రివేళ మృతుడి ఇంటికి చేరుకున్నారు. అయితే వృద్ధురాలైన ఆయన అమ్మమ్మ ఒంటరిగా ఉండటంతో ఒక్కసారిగా విషాద వార్త చెబితే ఆరోగ్య పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందని భావించి జాగ్రత్తగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
సారంగఢ్-బిలాయిగఢ్ జిల్లా పోలీసు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మృతుడి తల్లిదండ్రులు, సోదరుడికి విషయం తెలియజేయడంతో వారు జమ్మూకశ్మీర్‌కు బయలుదేరారు. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మానవత్వానికి వ్యతిరేకమైన నేరమని ఆయన ఖండించారు. ఇలాంటి పిరికిపంద చర్యలు ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
ఉగ్రదాడి విషయం తెలిసిన వెంటనే జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ పోలీసు అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ఆయన, ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ ఉగ్రదాడి మరోసారి వలస కార్మికుల భద్రతపై ఆందోళనలను పెంచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news