ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా-ఈజిప్టు మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. 0-2తో వెనుకబడిన అర్జెంటీనా చివర్లో అద్భుతంగా పుంజుకుని 3-2తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. టచ్‌లైన్ వద్ద ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి ఈజిప్టు జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుపై దూకుడుగా ఆడుతూ 2-0 ఆధిక్యాన్ని సాధించింది. అయితే మ్యాచ్ చివరి దశలో అర్జెంటీనా తన అనుభవాన్ని చూపించింది. 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో గోల్ చేసి జట్టుకు ఆశలు కల్పించగా, ఆ తర్వాత నాలుగు నిమిషాల్లోనే లియోనెల్ మెస్సి మరో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలో ఎంజో ఫెర్నాండెజ్ కీలక గోల్ చేయడంతో అర్జెంటీనా 3-2తో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
అయితే మ్యాచ్ ఫలితంపై ఈజిప్టు ఆటగాళ్లు, కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వీఏఆర్ నిర్ణయాలపై ఈజిప్టు జట్టు అభ్యంతరం తెలిపింది. తమకు అనుకూలంగా రావాల్సిన కొన్ని నిర్ణయాలు రాలేదని, కీలక సమయంలో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్‌ను ప్రభావితం చేశాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ చివరి నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో టచ్‌లైన్ దగ్గర ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్, అర్జెంటీనా కెప్టెన్ మెస్సి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు వీడియోలో కనిపించింది. ఇద్దరూ ఒకరితో ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడం, అనంతరం అధికారులు మధ్యలోకి వచ్చి పరిస్థితిని సద్దుమణిగించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
ఈ ఘటన తర్వాత హొస్సామ్ హసన్ ఫిఫా యాంటీ రేసిజం సంకేతాలు చేయడం కూడా చర్చకు కారణమైంది. ఆయన చేసిన ఆ చర్యపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను చూసిన మెస్సి కూడా కొంతసేపు ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించాడు. అనంతరం మెస్సి సహచర ఆటగాళ్లు అతడిని వెనక్కి తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై ఈజిప్టు ప్లేయర్ మొస్తఫా జికో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇవ్వాలని ముందే నిర్ణయించారని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆరోపణలు ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.
అర్జెంటీనా మాత్రం మరోసారి తన పోరాట పటిమను నిరూపించింది. రెండు గోల్స్ వెనుకబడిన పరిస్థితి నుంచి తిరిగి వచ్చి విజయం సాధించడం అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మెస్సి కీలక సమయంలో చేసిన గోల్ జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మరోవైపు ఈజిప్టు మాత్రం అద్భుత పోరాటం చేసినప్పటికీ చివరి నిమిషాల్లో విజయాన్ని చేజార్చుకుంది.
ప్రస్తుతం మెస్సి-ఈజిప్టు కోచ్ మధ్య జరిగిన వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. మ్యాచ్‌లోని ఉత్కంఠ, వివాదాస్పద నిర్ణయాలు, చివరి నిమిషాల డ్రామా కారణంగా ఈ ప్రిక్వార్టర్స్ పోరు ప్రపంచ కప్‌లో గుర్తుండిపోయే మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news