దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కుకూ ఎలక్ట్రానిక్స్ ఓవర్సీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెచ్‌వోడీ చో హన్ చుల్, ఆసియా రీజియన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గృహోపకరణాల తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీకి అనువైన క్లస్టర్ అభివృద్ధి చెందిందన్నారు. అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ సంస్థలు అక్కడ విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. దేశంలో తయారవుతున్న ఎయిర్ కండీషనర్లలో దాదాపు నలభై శాతం, టెలివిజన్లలో ముప్పై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా కూడా తయారీ రంగానికి ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి వివరించారు. రాష్ట్రం నుంచి ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేయవచ్చని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గృహోపకరణాల వినియోగం వేగంగా పెరుగుతోందని, ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం విశ్వసనీయ తయారీ కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. ఈ అన్ని అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శ్రీసిటీ లేదా తిరుపతిలో కుకూ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
సమావేశంలో స్పందించిన కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్‌వోడీ చో హన్ చుల్ తమ సంస్థ ప్రస్తుతం దక్షిణ కొరియాలో ప్రెషర్ రైస్ కుక్కర్ల తయారీలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కాలానుగుణంగా నీటి శుద్ధి పరికరాలు, గాలి శుద్ధి పరికరాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఆధునిక గృహోపకరణాలు, అద్దె సేవల రంగాల్లో కూడా సంస్థ వేగంగా విస్తరిస్తోందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు.
వంటగది ఉపకరణాలు, నీటి శుద్ధి వ్యవస్థలు, గాలి శుద్ధి పరికరాలు, హ్యూమిడిఫైయర్లు, బిడెట్లు వంటి అనేక ఉత్పత్తులను తమ సంస్థ తయారు చేస్తోందని చో హన్ చుల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా ఉపకరణాల యూనిట్లు అద్దె సేవల కోసం అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. నలభైకి పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, గత ఎనిమిదేళ్లుగా భారత మార్కెట్లో రైస్ కుక్కర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ల విక్రయాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో గృహోపకరణాల తయారీ రంగంలో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం కావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరగడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news