రష్యాపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. సమర రీజియన్‌లోని సిజ్రాన్ చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని కీవ్ దళాలు మెరుపు దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. జులై 11 నుంచి 12 మధ్య జరిగిన ఈ దాడుల్లో రిఫైనరీకి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ ఘటనతో రష్యా ఇంధన రంగంపై మరోసారి ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
సిజ్రాన్ చమురు శుద్ధి కర్మాగారం రష్యాలోని కీలక ఇంధన కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ఈ రిఫైనరీ ఏడాదికి సుమారు 8.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సమర ప్రాంతానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి కీలక ఉత్పత్తులు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. రష్యా సైనిక అవసరాలకు కూడా ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంటోంది.
ఈ రిఫైనరీని రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. తాజా డ్రోన్ దాడుల అనంతరం అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఉక్రెయిన్ గతంలో కూడా ఈ చమురు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 18, మే 11 తేదీల్లో కూడా ఇదే రిఫైనరీపై దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్ దాడులు కేవలం చమురు శుద్ధి కర్మాగారాలకే పరిమితం కాలేదు. అజోవ్ సముద్రంలో రష్యాకు చెందిన 10 ట్యాంకర్లు, నాలుగు ఫెర్రీలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురును రవాణా చేస్తున్న ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అలాగే ధ్వంసమైన ఫెర్రీలను రష్యా సైనిక లాజిస్టిక్స్, సరకు రవాణా అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.
జులై 11న టోక్మాక్ ప్రాంతంలో భారీగా లూబ్రికెంట్ ఆయిల్ తరలిస్తున్న రైలును కూడా ఉక్రెయిన్ దళాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో పాటు అనేక చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఈ దాడుల ద్వారా రష్యా ఇంధన సరఫరా వ్యవస్థను బలహీనపరచడమే లక్ష్యంగా ఉక్రెయిన్ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యం గణనీయంగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం రష్యా రిఫైనరీ సామర్థ్యంలో 20 శాతం నుంచి 40 శాతం వరకు ప్రభావం పడినట్లు సమాచారం. ఇంధన ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రష్యాలో చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇంధన మౌలిక వసతులు కీలక లక్ష్యాలుగా మారుతున్నాయి. సైనిక సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఇరు దేశాలు వ్యూహాత్మక దాడులు కొనసాగిస్తున్నాయి. తాజా డ్రోన్ దాడులు యుద్ధం మరింత విస్తృత స్థాయికి చేరుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news