దేశీయ నిఘా వ్యవస్థలో కీలక సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కొత్త డైరెక్టర్‌గా Mahesh Dixit నియమితులయ్యారు. 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన జూన్ 30 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగేళ్లపాటు ఐబీ డైరెక్టర్‌గా పనిచేసిన Tapan Kumar Deka పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మహేశ్ దీక్షిత్‌ను రెండేళ్ల కాలానికి నియమించింది.
వైద్య విద్య పూర్తిచేసి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మహేశ్ దీక్షిత్ అనంతరం సివిల్ సర్వీసుల్లో చేరి పోలీసు సేవలను ఎంచుకున్నారు. విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి దాదాపు 26 సంవత్సరాలకుపైగా నిఘా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కోహిమా, పాట్నా, హైదరాబాద్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
జమ్మూకశ్మీర్‌లో ఆయన సేవలు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జాయింట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, హైబ్రిడ్ టెర్రరిజం, సరిహద్దు చొరబాట్లు, అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. నక్సలిజం వ్యతిరేక చర్యలు, ఈశాన్య రాష్ట్రాల భద్రతా వ్యవహారాలు, లద్దాఖ్‌కు సంబంధించిన వ్యూహాత్మక అంశాల నిర్వహణలోనూ ఆయనకు విశేష అనుభవం ఉంది.
ప్రచారానికి దూరంగా ఉండే అధికారిగా పేరున్న మహేశ్ దీక్షిత్, నిఘా సమాచార సేకరణ, వ్యూహాత్మక ప్రణాళికలు, భద్రతా సంస్థల మధ్య సమన్వయం పెంపులో నైపుణ్యం సంపాదించారు. ప్రస్తుతం ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, గూఢచర్య కార్యకలాపాలు, సరిహద్దు భద్రత వంటి సవాళ్లు పెరుగుతున్న తరుణంలో ఆయన నాయకత్వంలో ఐబీ మరింత సాంకేతిక ఆధారిత నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news