జమ్మూ కశ్మీర్‌లోని Rajouri జిల్లాలో ‘పోలియో రహిత పాకిస్థాన్’ అనే నినాదంతో ప్రచారంలోకి వచ్చిన కరపత్రం వివాదానికి దారితీసింది. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించినట్లు కనిపించిన ఈ పోస్టర్ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా వైద్యాధికారులు సంబంధిత అధికారుల నుంచి తక్షణ వివరణ కోరారు.
పరిశీలనలో ఆ కరపత్రంపై జాతీయ అత్యవసర కార్యకలాపాల కేంద్రం (NEOC) లోగోతో పాటు “Polio Free Pakistan” అనే నినాదం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ లోగో, నినాదానికి జమ్మూ కశ్మీర్ ఆరోగ్య శాఖ లేదా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారిక ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ పోస్టర్లో సంబంధిత బ్లాక్ మెడికల్ ఆఫీసర్ పేరు, హోదా కూడా ఉండటంతో అధికారులు దాని తయారీ, ముద్రణ, ప్రచారం వెనుక ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. పోస్టర్‌ను అధికారిక అనుమతితో రూపొందించారా, ఎవరి ఆదేశాలతో ప్రచారం చేశారనే అంశాలపై ఒక రోజులోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని విస్తరించిన కమ్యూనిటీ హెల్త్ అధికారిని కూడా వివరణ కోరారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ World Health Organization 2014లో భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హోదాను కొనసాగించేందుకు దేశవ్యాప్తంగా ‘ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026’ నిర్వహిస్తున్న సమయంలో ఈ వివాదాస్పద పోస్టర్ వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అధికారిక అనుమతి లేకుండా ప్రభుత్వ పేరుతో ఎలాంటి ప్రచార సామగ్రి విడుదల చేయరాదని ఆరోగ్య శాఖ మరోసారి స్పష్టం చేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news