'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక రాంగ్ డెలివరీతో ప్రారంభమైన చిన్న గొడవ క్రమంగా పెద్ద వివాదంగా మారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తుండగా, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
సమాచారం ప్రకారం, గచ్చిబౌలిలోని అరుణ రెసిడెన్సీలో నివసిస్తున్న అఖిల్ రాజ్ ఇంటికి పొరపాటున మరో అపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సిన పార్సిల్ డెలివరీ అయింది. డెలివరీ బాయ్ అడ్రస్, ఓటీపీ, వివరాలు సరిగా చెక్ చేయకుండానే పార్సిల్ అందించాడని అఖిల్ వర్గం చెబుతోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన తర్వాత డెలివరీ బాయ్ రమేశ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేస్తూ, తాను క్షమాపణ చెప్పినా అఖిల్ రాజ్ తనను దుర్భాషలాడారని, కొట్టేందుకు ప్రయత్నించారని, అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో హీరోపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీనికి స్పందించిన అఖిల్ రాజ్ కూడా తన వాదనను వెల్లడించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకుండానే తనపై విమర్శలు చేయొద్దని కోరారు. తాను ఎవరినీ దాడి చేయలేదని, వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.
ఈ వివాదం మరింత ముదరడంతో పలువురు డెలివరీ బాయ్స్ కలిసి అఖిల్ రాజ్ నివాసం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. అఖిల్ ఇంటి నుంచి కారులో బయటకు వస్తుండగా కొందరు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారని, దీంతో ఆయన నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భద్రతపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు డెలివరీ బాయ్ కూడా ఇప్పటికే అఖిల్ రాజ్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియోలు, సాక్ష్యాలను పరిశీలిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
చిన్న అపార్థంతో మొదలైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చగా మారింది. అసలు తప్పు ఎవరిది? ఘటనలో నిజానిజాలు ఏమిటి? అనే విషయాలను పోలీసులు దర్యాప్తు అనంతరం స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news