అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందంజలో నిలపడం లక్ష్యంగా పెట్టుబడులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మొత్తం 11 భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.9,076 కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, 10,531 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఇథనాల్ తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇథనాల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఆకర్షించాలని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమం పెరగనున్న నేపథ్యంలో మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్ రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించాలని ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ విధానాలే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు.
పర్యాటక రంగ అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో అనుభవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తిమ్మమ్మ మర్రిమాను, పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి వంటి ప్రాంతాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఏటికొప్పాక, కొండపల్లి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని చెప్పారు. ప్రకృతి పర్యాటకం, జల పర్యాటకం, వినోద పార్కులను అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో హోటల్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. 2024లో రాష్ట్రంలో 4,390 హోటల్ గదులు ఉండగా, గత రెండేళ్లలో కొత్తగా 9,364 గదుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో మొత్తం13,753 హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి మరింత వాటా పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలపాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించాలని, ఈ రంగంలో ఏపీ అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. రైల్వే టెర్మినల్స్తో ఎంఎస్ఎంఈ పార్కులను అనుసంధానం చేయాలని, యువతకు నైపుణ్య శిక్షణ అందించేలా లాజిస్టిక్స్ యూనివర్సిటీ, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలతో సమన్వయం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో హోటళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, లాజిస్టిక్స్ పార్కులు, సోలార్ సెల్ తయారీ యూనిట్లు, గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో నాలుగు నక్షత్రాల హోటల్, వైఎస్సార్ కడప జిల్లాలో మూడు నక్షత్రాల హోటల్, సమగ్ర వినోద పార్కు, విజయవాడలో హోటల్, బ్యాంక్వెట్, ఎగ్జిబిషన్ సెంటర్ వంటి ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి.
అనకాపల్లి జిల్లా పరవాడలో సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్‌కు రూ.1,600 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. బొబ్బిలి ప్రాంతంలో మాంగనీస్ ఆధారిత పరిశ్రమకు రూ.1,200 కోట్ల పెట్టుబడులు వస్తాయి. కర్నూలు జిల్లాలో స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు రూ.689 కోట్ల పెట్టుబడులు ఆమోదించారు. విశాఖపట్నంలో లాజిస్టిక్స్, పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రూ.1,008 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదానీ ఫౌండేషన్ ప్రాజెక్టుకు రూ.2,200 కోట్ల పెట్టుబడులు, తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఆహార శుద్ధి పరిశ్రమకు రూ.1,801 కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందాయి.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇప్పటివరకు 19 రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశాల ద్వారా 339 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, మొత్తం రూ.11.86 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా 10 లక్షలకుపైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
రైతులను కేవలం వ్యవసాయంపై ఆధారపడే స్థితి నుంచి పారిశ్రామిక భాగస్వాములుగా తీర్చిదిద్దడం, యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పర్యాటకం, ఇంధనం, ఆహార శుద్ధి, తయారీ రంగాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news