విజయనగరం జిల్లాలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ సమస్యలు, కబ్జా ఆరోపణలు, రెవెన్యూ రికార్డుల్లో తప్పిదాలు, ఇళ్ల మంజూరు వంటి పలు అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వజ్జ బాబురావు అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వివరించి న్యాయం చేయాలని కోరారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన దంగా భూలోక తన భూమికి సంబంధించిన సమస్యపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులకు 1997లో ప్రభుత్వం ద్వారా పట్టాలు మంజూరు చేసిన భూమిని ప్రస్తుతం కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోనాడ గ్రామంలో సర్వే నంబర్లు 44/5, 44/6, 44/7లో మొత్తం ఏడు సెంట్ల భూమికి ముగ్గురికి పట్టాలు మంజూరు అయ్యాయని తెలిపారు. అందులో కొంత భాగంలో ఇళ్లు నిర్మించుకుని, మిగిలిన భూమిలో కొబ్బరి మొక్కలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వివరించారు.
వైసీపీ ప్రభుత్వ సమయంలో తన భూమిపై స్థానికంగా ఫిర్యాదులు చేయించి ఫారం-7 నోటీసులు ఇచ్చారని, దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ తిరిగి ఫారం-6 ద్వారా భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశాలతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
వైఎస్సార్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం ఉత్తుకూరు గ్రామానికి చెందిన బైరెడ్డి చిన్న అంకాల రెడ్డి కూడా భూమి రికార్డుల సమస్యపై అర్జీ సమర్పించారు. గ్రామంలోని సర్వే నంబర్ 669లో ఉన్న భూమిలో తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 25 సెంట్ల భూమి రికార్డుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో ఈ భూమి డాటెడ్ ల్యాండ్ జాబితాలో ఉండగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2022లో ప్రైవేట్ పట్టా భూమిగా మార్చారని వివరించారు. అయితే రెవెన్యూ అధికారులు పొరపాటున మళ్లీ ఆ భూమిని ఫ్రీహోల్డ్ డేటా జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్, ఇతర రెవెన్యూ సేవలు పొందడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే రికార్డులను సరిచేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన పుచకాయల వెంకటరావు తన పూర్వీకుల భూముల విషయంలో జరుగుతున్న వివాదంపై ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 148/2లో 1.38 ఎకరాలు, 150/1లో 0.42 ఎకరాల భూములకు సంబంధించి కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో మ్యుటేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ కోర్టును ఆశ్రయించగా అద్దంకి ఆర్డీవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అనధికారిక మ్యుటేషన్లు, వెబ్‌ల్యాండ్ నమోదులను రద్దు చేసినట్లు వివరించారు. అలాగే భూమిపై తాజా విచారణ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ను ఆదేశించారని తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామానికి చెందిన ఆకిరి ప్రసాద్ రావు గ్రామంలో ఇళ్ల మంజూరు సమస్యపై అర్జీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయలేదని ఆరోపించారు. గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 80 కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం సేకరించిన భూమిలో ఖాళీగా ఉన్న స్థలాలను అర్హులకు కేటాయించి ఇళ్లు నిర్మించే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలకు కూడా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ వివాదాలు మాత్రమే కాకుండా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాలు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సహాయం వంటి అనేక అంశాలపై ప్రజలు అర్జీలు అందించారు. కొందరు ఉద్యోగాల కోసం తమ విద్యార్హత వివరాలతో కూడిన దరఖాస్తులు సమర్పించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు ఆర్థిక సహాయం కోరారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news