విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. విజయవాడ సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 57, 63 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.8.88 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని నిరంతరం పనిచేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతగా స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తమ సమస్యలను స్వయంగా తెలియజేసే అవకాశం కల్పించడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో డివిజన్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బొండా ఉమా పేర్కొన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తులను పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న వారికి త్వరగా ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
లబ్ధిదారులకు గౌరవప్రదంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, పదవి తనకు అలంకారం కాదని, అది ప్రజలకు సేవ చేసే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు.
2024 నుంచి ఇప్పటి వరకు 24 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
గుణదల రైల్వే గేట్ వద్ద రూ.98.68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన జరిగిందని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. అదేవిధంగా తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు హెడ్వాటర్ వర్క్స్ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
సుమారు రూ.80 కోట్లతో ఆధునిక తాగునీటి ప్రాజెక్టు, ఫిల్ట్రేషన్ ప్లాంట్, కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
డివిజన్ స్థాయి నాయకులు ప్రజల్లో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరవేస్తున్నారని బొండా ఉమా తెలిపారు. తాను కూడా కార్యాలయంలోనూ, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు.
రాబోయే రోజుల్లో కూడా ఇదే నిబద్ధతతో ప్రజాసేవ కొనసాగిస్తానని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంచ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు ఎస్కే కబీర్, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోత్కూరి కాసిం, లబ్బా దుర్గా, ఎరుబోతు కనకరావు, ఎస్కే మెహర్, జానీ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news